కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా రామాయంపేట (Ramayampet) మండల పరిధిలోని జాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన సదాశివ నగర్ తండా సమీపంలో ఒక ఎలుగుబంటి మృతి చెందింది. స్థానిక రైతులు ఉదయాన్నే తమ పంట పొలాలకు వెళ్లే దారిలో ఈ ఎలుగుబంటి మృతదేహాన్ని గమనించారు. అడవి జంతువు మృతి చెంది ఉండటాన్ని చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఈ ఎలుగుబంటి అనారోగ్య కారణాల వల్ల మరణించిందా, లేక వయసు పైబడి సహజ మరణం పొందిందా అనే విషయాలు ఇంకా స్పష్టం కాలేదు. ఎలుగుబంటి మృతికి గల అసలు కారణాలను అన్వేషించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.

