కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, విస్తరణతో పాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి, స్థానిక ప్రజాసమస్యలపై విస్తృతంగా సమీక్షించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనల (Janasena Telangana Tour) షెడ్యూల్‌ను జనసేన విడుదల చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొదటి విడత సమావేశం విజయవంతంగా ముగిసింది. మిగిలిన 13 పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలు పూర్తి చేసిన తర్వాత, చివరి విడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయని పార్టీ ప్రకటించింది.
ఈ విస్తృత పర్యటనల షెడ్యూల్ జూలై 25 శనివారం రోజున చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 1 శనివారం రోజున మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశం జరుగుతుంది. ఆగస్టు 8 శనివారం ఉదయం ఆదిలాబాద్, సాయంత్రం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయి. ఆగస్టు 9 ఆదివారం నాడు ఉదయం కరీంనగర్, సాయంత్రం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తారు.
పర్యటనల తదుపరి విడతలో భాగంగా ఆగస్టు 16 ఆదివారం ఉదయం మెదక్, సాయంత్రం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో నాయకత్వం పర్యటిస్తుంది. అనంతరం ఆగస్టు 22 శనివారం నాడు ఉదయం నల్గొండ, సాయంత్రం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. ఆగస్టు 23 ఆదివారం రోజున ఉదయం వరంగల్, సాయంత్రం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. చివరగా ఆగస్టు 29 శనివారం రోజున నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనతో ఈ విడత షెడ్యూల్ ముగుస్తుంది. ఈ క్షేత్రస్థాయి పర్యటనలు తెలంగాణలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

