ప్రభుత్వం దిగిరాకపోతే ఢిల్లీని ముట్టడిస్తాం: సీజేపీ హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీ, విద్యావ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు (CJP Protest) తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ సందర్భంగా సిజెపి జాతీయ ప్రతినిధి అశుతోష్ రంకా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ ఉద్యమం భారత చరిత్రలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమంగా నిలిచిపోతుందని అభివర్ణించారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన సంఘటనలు కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం గనుక విద్యార్థులు, యువత డిమాండ్లకు అంగీకరించకపోతే దేశం నలుమూలల నుండి మిలియన్ల సంఖ్యలో యువత ఢిల్లీకి తరలివస్తారని ఆయన హెచ్చరించారు. ఈసారి తాము వెనక్కి తగ్గేదే లేదని, నిశ్శబ్దంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

యువత డిమాండ్లను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో ఈ దేశ యువశక్తి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని అశుతోష్ రంకా హెచ్చరించారు. తాము శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నామంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. గత 31 రోజులుగా యువత పూర్తిగా గాంధీ, అంబేడ్కర్ ఆశయాల మార్గంలోనే శాంతియుతంగా నిరసన తెలియజేస్తోందని గుర్తుచేశారు. జూలై 20 నాటి మార్చ్ కూడా ప్రశాంతంగానే సాగిందని, అయితే పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి, దారుణంగా కొట్టడం వల్లే అక్కడ తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత నెలకొన్నాయని ఆరోపించారు.

తమ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా, ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకూడదనేది తమ ప్రధాన డిమాండ్ అని అశుతోష్ రంకా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఎవరిపైనా కేసులు పెట్టబోమని హామీ ఇచ్చేంత వరకు ఈ నిరసనలు ముగిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ నాయకత్వం కేసులకు గానీ, నిర్బంధాలకు గానీ భయపడటం లేదని, మొదటి రోజు నుంచే తాము యుఏపీఏ (UAPA), ఎన్ఎస్ఏ (NSA) వంటి కఠిన చట్టాల కింద అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దేశ యువత భవిష్యత్తు కోసం జైలుకు వెళ్లడం చాలా చిన్న విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం ఒకే పార్టీకి సంబంధించినది కాదని, విద్యార్థుల ఉమ్మడి భవిష్యత్తుకు సంబంధించినది కాబట్టి, చివరకు అధికార బీజేపీకి చెందిన వారైనా సరే, ఈ న్యాయమైన పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>