కలం, వెబ్ డెస్క్: నేషన్ ఫస్ట్ అనే స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు (Ramchander Rao) అన్నారు. మహబూబాబాద్‌లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌లో భాగంగా నిర్వహించిన జిల్లా బీజేపీ కార్యకర్తల జిల్లా ప్రశిక్షణ వర్గ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతాల స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమాన్ని చేరవేయడమే కమలం పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలంగాణకు రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు అందించిందని వివరించారు.
గిరిజన సంక్షేమానికి అపూర్వ ప్రాధాన్యత..
మోదీ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అపూర్వ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సమ్మక్క -సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. రికార్డు స్థాయి బడ్జెట్ కేటాయింపుల నుంచి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపన వరకు బీజేపీ విశేష కృషి చేసిందన్నారు. గిరిజన విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల బలోపేతం నుంచి భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా గుర్తించడం వరకు, మోదీ ప్రభుత్వం గిరిజన సమాజాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవించి, సాధికారత కల్పిస్తోందని వివరించారు.

