కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి(Peddapalli) బస్టాండ్ సమీపంలోని హనుమాన్ నగర్‌లో(Hanuman Nagar) బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. గద్దల శ్రీనివాస్ (భర్త) తన భార్య పుష్పలత చేతిలోనే హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం, భార్యాభర్తలైన శ్రీనివాస్, పుష్పలతల మధ్య గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాస్ తరచూ మద్యం సేవించి వచ్చి తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, ఆ వేధింపులు భరించలేకే ఈ ఘోరానికి పాల్పడాల్సి వచ్చిందని భార్య పుష్పలత ప్రాథమిక విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
ఘటనా స్థలంలో శ్రీనివాస్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

