పల్లెకు ‘రహదారి’భరోసా.. కొత్త అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం

కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ పల్లెల రహదారుల రూపురేఖలు మార్చే మహా యజ్ఞానికి ములుగు వేదిక కానుంది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.16,007 కోట్లతో భారీ రహదారి ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ములుగు (Mulugu) నుంచే శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 2,145 రోడ్లను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తారు. పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలు, ప్రధాన రోడ్లకు మెరుగైన అనుసంధానం కల్పిస్తారు. రహదారుల నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) (HAM Roads) విధానంలో ప్రభుత్వం చేపట్టనుంది

గ్రామం నుంచి రాష్ట్ర కేంద్రం దాకా..

ప్రతి గ్రామాన్ని మండల కేంద్రంతో రెండు వరుసలు, మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో నాలుగు వరుసలు, జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర కేంద్రంతో ఆరు వరుసల రహదారి ద్వారా అనుసంధానించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇలా పల్లెల నుంచి పట్టణాలకు రవాణా మరింత సులభతరం కానుంది. రహదారులు మెరుగుపడితే దాని ప్రభావం గ్రామీణ జీవనంలోని ప్రతి రంగంపైనా పడనుంది. రైతులు పంటలను మార్కెట్లకు వేగంగా తరలించుకోవడంతో పాటు విద్యార్థులు విద్యాసంస్థలకు, రోగులు ఆస్పత్రులకు సకాలంలో చేరుకునే అవకాశం ఉంటుంది. రవాణా సౌకర్యం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాలకూ కొత్త దారులు పడతాయి.

ములుగు ఎందుకు వేదిక?

అటవీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా కలిగిన ములుగు జిల్లాను ప్రారంభ వేదికగా ఎంపిక చేయడం వెనుక ప్రత్యేక ఉద్దేశం ఉంది. మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం బాగుంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహించే ములుగు నుంచే ఆమె శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరో విశేషం. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రహదారులే తొలి మెట్టు అనే సంకేతాన్ని ప్రభుత్వం ములుగు వేదికగా ఇవ్వనుంది. రూ.16 వేల కోట్లకుపైగా పెట్టుబడి.. వేల కిలోమీటర్ల రహదారులు.. పల్లె నుంచి పట్టణం వరకు అనుసంధానం.. ఇలా మొత్తంగా ములుగు నుంచి తొలి అడుగు పడుతుండగా తెలంగాణ గ్రామీణ రవాణా రంగం భవిష్యత్ లో కీలక మలుపుగా నిలిచే అవకాశముంది.

పదిహేనేళ్ల పాటు నిర్వహణ కూడా

రహదారుల నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో ప్రభుత్వం చేపట్టనుంది. ఇందుకు బ్యాంకులు, నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఆర్థిక వనరులను సమీకరించనుంది. అంతేకాదు.. రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు సంబంధిత నిర్మాణ సంస్థలే నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. దీంతో రహదారుల నిర్మాణ నాణ్యతతో పాటు మన్నికపైనా దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>