RGV Shiva | శివ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ పేరే వైబ్రేషన్. తెలుగు సినిమా ఒరవడినే మార్చిన సినిమా. నాగార్జున కెరీర్‌ను పతాకస్థాయికి తీసుకెళ్లిన సినిమా. ఇలా కూడా తీయొచ్చా? సినిమా అన్నట్టుగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన సినిమా. తెలుగు సినిమా మూస ధోరణిని బద్దలు కొట్టేసిన మూవీ. సినిమాకు ఓ ఫిక్స్ డ్ ఫార్ములాను సిద్ధం చేసుకున్న దర్శకుల బూజు దులిపింది శివ. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగులు అన్ని అంశాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది శివ. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఇప్పటికీ మరవలేకపోతున్నారు. నవంబర్ 14న శివ సినిమా రీరిలీజ్ కాబోతున్నది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
శివ సినిమా ప్రకటన సందర్భంలోనూ.. షూటింగ్ సమయంలో ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. నాగార్జున, అక్కినేని కుటుంబానికి ఉన్న మార్కెట్ తో 1989 అక్టోబర్ 5న థియేటర్ల ముందుకు వచ్చింది. కానీ సినిమా చూసొచ్చిన ప్రేక్షకుల స్పందన అపూర్వంగా ఉంది. గతంలో తెలుగు ప్రేక్షకులు చూసిన సినిమా లెక్కలు వేరు. హీరోయిజం, మాస్ డ్యాన్స్‌లు ఒకే తరహా సినిమాలు చూసి చూసి వాళ్ల చెవులు తుప్పుపట్టిపోయాయి. మెదళ్లు మొద్దుబారాయి. ఓ తరహా సినిమాలకు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. కానీ శివ విడుదలతో ప్రేక్షకుల్లో అలజడి మొదలైంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు మారుమోగింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి ఎంతో మంచి పేరొచ్చింది. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. తెలుగు సినిమా లోకంలో ఓ పెద్ద భూకంపం లాంటిది కనిపించింది. ఆ సమయంలో ఎక్కడ చూసినా ఈ సినిమా ప్రస్తావనే.
ఇది రొటీన్ లైన్ కాదు
అప్పటివరకు ఉన్న ప్రేమ కథల్లో హీరో కలల రాకుమారుడు, హీరోయిన్ నిరుపేద అందమైన యువతి. లేదంటే కథానాయిక కోటీశ్వరుడి కూతురు, హీరో ఓ రిక్షా తొక్కేవాడు. ఇద్దరికీ అంతరాలు, తండ్రేమో కాకలు తీరిన విలన్. హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్. ఇటువంటి మూస కథలు అప్పటివరకు ఉండేవి. కానీ శివ నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనల సమాహారం. కాలేజీ రోజులు, నగరాల్లో ఎదుగుతున్న రౌడీ మూకలు ఈ సినిమాలో పాత్రలు. శివ సినిమాలో నాగార్జున, అతడి స్నేహితులు విలన్ రఘువరన్, అతడి చుట్టూ ఉండే అనుచరులు అంతా మన కండ్ల ముందు కనిపించేవారే.. నిత్యం ఏదో ఒక చోట తారసపడే వ్యక్తులే. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. సినిమా అంటే ఊహాప్రపంచంలో ఉండే పాత్రలు మాత్రమే కాదు.. మన నిజ జీవితంలో మన చుట్టూ ఉంటే మనుషులు, వాళ్లల్లో ఉండే భావోద్వేగాలు కూడా కథలుగా మార్చొచ్చని రామ్ గోపాల్ వర్మ నిరూపించారు. అందుకే ప్రేక్షకులు అంతలా ఆదరించారు.
RGV Shiva | ‘శివ’ఓ కాలేజీ లవ్ స్టోరీ కానే కాదు. ఓ సాధారణ యువకుడి రోజువారీ జీవితం. అతడికి వచ్చే ఆవేశం, అతడి ఆలోచనా ధోరణి. దాని మధ్యలో వచ్చే సహజంగా వచ్చే లవ్, స్నేహం, వ్యవస్థతో పోరాటం. నాగార్జున మాస్ హీరోలా కాదు.. ఓ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. అమల హీరోయిన్ కాదు.. మన పక్కింట్లో ఉంటే ఓ అమ్మాయిలా కనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రలు అంతే. ఇంత సహజంగా తీశారు వర్మ. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు ఈ ఒరవడిని కొంతకాలమే కొనసాగించాయి. ఇక సినిమాలో ఇళయరాజా మ్యూజిక్ కట్టిపడేస్తుంది. అది నేపథ్య సంగీతమైనా, పాటల్లోనైనా. డైలాగులు భారీగా ఉండవు. కానీ స్క్రీన్ ప్లేతో ప్రతిసన్నివేశం మనసులో గుర్తిండి పోతుంది. శివ అంటే ఓ రెవల్యూషన్, ఓ కొత్త పంథా. అందుకే నవంబర్ 14 ఈ సినిమా రీరిలీజ్‌కు వస్తోంది.
Read Also: మీడియాపై అడవిశేషు రుసరుస.. ఆ పదంపై అభ్యంతరం
Follow Us on: Instagram

