కలం, వెబ్ డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన బాహుబలి చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి. ఆ సమయంలో రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన ‘మాహిష్మతి’ సామ్రాజ్యం సెట్లు చూసి ప్రేక్షకులు అప్పట్లో నోరెళ్లబెట్టారు. వందల ఎకరాల్లో విస్తరించిన ఆ సెట్లు సినిమా కంటే ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఏ స్థాయిలో అంటే.. సినిమాలో నటించిన హీరోహీరోయిన్ల కంటే ఆ అద్భుత కట్టడాల గురించే జనం ఎక్కువగా చర్చించుకున్నారు. ఆ సెట్లను చూడటానికి ఇప్పటికీ పర్యాటకులు రామోజీ ఫిలింసిటీకి వెళ్లడం వాటికున్న క్రేజ్‌కు నిదర్శనం.
అయితే, తాజాగా మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి (Varanasi) మూవీ విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం సుమారు 20 కోట్ల రూపాయలతో వారణాసి నగరాన్ని, అక్కడి గంగా ఘాట్లను ప్రతిబింబించేలా సహజమైన సెట్లు వేశారు. వీటి ఫొటోలు, వీడియోలు విడుదలైనప్పటికీ, బాహుబలి సమయం లో కనిపించినంత విపరీతమైన చర్చ గానీ, ‘బజ్’ గానీ జనంలో పెద్దగా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
బహుశా బాహుబలి ఒక కాల్పనిక ప్రపంచం కావడం, వారణాసి తెలిసిన నగరం కావొచ్చు. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల ఫోకస్ సెట్ల కంటే మహేష్ బాబు లుక్, గ్లోబల్ అడ్వెంచర్ కథాంశంపై ఎక్కువగా ఉండటం దీనికి కారణం కావచ్చు.

