కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం (Bhadrachalam) పరిసర ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలు పరిశీలిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. గురువారం భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్ధం జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.
అలాగే భద్రాచలం (Bhadrachalam) రామాలయంతో పాటు, పట్టణం అభివృద్ధి కోసం మూడు దశల్లో రూ.586 కోట్ల తో ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశామని ప్రకటించారు. ఇందులో భాగంగా బుధవారం రూ.351 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. శుక్రవారం నవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తుమ్మల తెలిపారు. శ్రీరాములవారి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారని మంత్రి తుమ్మల వెల్లడించారు.

