కలం, వెబ్ డెస్క్ : సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతికి ఒక రోజు ముందుగా వచ్చే పండగే భోగి (Bhogi). ఈ రోజు తెల్లవారు జామునే లేచి భోగి మంటలు వేస్తారు. అలాగే, చిన్నారులపై భోగి పండ్లు పోస్తారు. అసలు, భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది. భోగి మంటలు ఎందుకు వేస్తారు.. పండుగ వెనుక ఉన్న పరమార్థం ఏంటీ? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూర్యుడు దక్షిణాయణంలోకి ప్రవేశించడంతో ఈ కాలంలో చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఈ చలి బాధలను తప్పించుకోవడంతో పాటు దక్షిణాయణంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి ఇస్తు..ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారని ప్రతీతి. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి పేరు వచ్చిందని తెలుస్తోంది. పురాణాల ఆధారంగా, శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి విలీనమై భోగాన్ని పొందిందని పెద్దలు చెబుతుంటారు. పురాణాల ప్రకారం, భోగి రోజునే విష్ణువు వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కాడట. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని కూడా ఇదే రోజు ఎత్తినట్లు చెబుతారు.
చిన్నారుల జాతకంలోని గ్రహదోషాలు, పూర్వజన్మ పాప ఫలితాలు తొలిగి వారి భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు భోగి పండ్లు పోస్తారని పెద్దలు చెబుతారు. పిల్లలు భోగాలను అనుభవించకుండా ఆపే పీడలను అడ్డుకునేందుకు రేగుపళ్లు, చెరుకుగడలు, నాణేలు కలిపి వారిపై పోస్తారు. మనలోని, మన చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి నూతన వెలుగులకు స్వాగతం పలకడమే భోగి పండుగ వెనుక ఉన్న పరామార్థం. భోగి మంటల్లో ఆవు పేడ పిడకలు, పాత వస్తువులను వేయడం వల్లే వచ్చే మంట, పొగ ద్వారా మన చుట్టూ ఉన్న హానికరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. పాతవస్తువులు కాల్చడం ద్వారా మనలోని పాత ఆలోచనలు వదిలి కొత్త మార్గం వైపు నడవాలని సూచిస్తుంది. చలిని తరిమి కొట్టడంతో పాటు అజ్ఞానాన్ని విడనాడి నూతన చైతన్యాన్ని నింపడమే భోగి (Bhogi) పండుగ వెనుక ఉన్న పరమార్థం.
Read Also: క్యాబినెట్ భేటీ @ మేడారం
Follow Us On: Pinterest


