కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఛాంపియన్ ఎవరు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లలో కప్పు ఎత్తేది ఎవరు? తన సత్తా చాటుకునే కెప్టెన్ ఎవరు? ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా ఇదే చర్చ నడుస్తోంది. పది జట్లతో ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హోం టీమ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌పై 92 పరుగుల భారీ తేడాతో గెలిచి, రికార్డు స్థాయిలో 254 పరుగులు చేసిన బెంగళూరు నేరుగా ఫైనల్ చేరగా.. గుజరాత్ జట్టు క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి రెండో ప్రయత్నంలో ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. బెంగళూరు ఈ మ్యాచ్ గెలిస్తే వరుసగా రెండుసార్లు ఐపీఎల్ కప్పు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. మరోవైపు గుజరాత్ తమ సొంత మైదానంలో బెంగళూరుకు షాక్ ఇచ్చి, నాలుగేళ్లలో రెండోసారి ట్రోఫీని ముద్దాడాలని చూస్తోంది.
ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. ఈ మ్యాచ్ బెంగళూరు బ్యాటింగ్ పటిష్టతకు, గుజరాత్ బౌలింగ్ విభాగానికి మధ్య జరగబోయే పోరులా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ వంటి భీకరమైన హిట్టర్లతో బెంగళూరు బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉంది. దీనికి పోటీగా గుజరాత్ జట్టులో పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్న కాగిసో రబాడ, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్ వంటి మేటి బౌలర్లు ఉన్నారు. అయితే గత మ్యాచ్‌లో భుజం గాయంతో ఇబ్బంది పడిన సిరాజ్ ఫిట్‌నెస్ గుజరాత్‌కు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్ బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జోడి ఇప్పటికే 1,400 కి పైగా పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉండగా, వారికి జోస్ బట్లర్ తోడయ్యారు. ఇటు బెంగళూరు బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లతో అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్య కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు.
ఈ సీజన్ లో జరిగిన మూడు ముఖాముఖి పోరుల్లో బెంగళూరు రెండు మ్యాచ్ లు గెలిచి స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, గుజరాత్ జట్టుకు తమ సొంత మైదానమైన అహ్మదాబాద్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచిన బలమైన రికార్డు ఉంది. ఆదివారం రాత్రి స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లు, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ గ్రాండ్ ఫైనల్లో, ఇరు జట్లలో ఏది ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని తమ ముద్ర వేస్తుందో వారినే ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ వరించనుంది.

