కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ (Ghaziabad)లో సంచలనం సృష్టించిన సూర్య చౌహాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడ్డాడు. మే 28వ తేదీన సూర్య చౌహాన్‌ను అసద్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖోడా పోలీస్ స్టేషన్‌లో ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడైన అసద్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకున్న వారికి పోలీసులు రూ. 50 వేల బహుమతిని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అసద్ తన స్నేహితులను కలిసి, డబ్బు తీసుకుని పారిపోవడానికి ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందం ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.
బైక్‌పై వస్తున్న అసద్, అతని స్నేహితుడిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. వారు బండిని ఆపకుండా పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో అసద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనలో ఒక కానిస్టేబుల్ కూడా గాయపడటంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి అసద్ ఉపయోగించిన బైక్, పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతూ తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

