కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతోందని, గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసగించారని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం రామచంద్రాపురంలో గురువారం ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం విప్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ జీవిత బీమా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లు తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇవ్వడమే కాకుండా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపన ద్వారా విద్యలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా “యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్” అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, సర్పంచి నర్సింహులు, ఉప సర్పంచి కేశవనంద్, నాయకులు రామచంద్రయ్య, శ్రీనివాస్ యాదవ్, వీరన్న, రాఘవేందర్ గౌడ్, పెంటయ్య, లక్ష్మయ్య, కోడూరు రవి, పాండు, గోవింద్ యాదవ్ పాల్గొన్నారు.

