కలం, కరీంనగర్: పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బాలుసాని అంజయ్య, అసిస్టెంట్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ బట్టు శ్రీనివాస్‌లను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజాసేవలో ఈ అధికారులు అందించిన విశేష సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగి, శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి అంకితభావం తోటి సిబ్బందికి ఆదర్శనీయమని ప్రశంసించారు.
42 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో గడవాలని సీపీ ఆకాంక్షించారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదవీ విరమణ తర్వాత కూడా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్ఎస్సై తిరుపతి, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్, కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.

