కలం, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె అంజిలి రెడ్డి వివాహం తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. షర్మిల ఈ వివాహాన్ని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో జరిపించాలని భావించారు. పెళ్లి పత్రికల్లో కూడా వివాహ వేదిక యలహంక ప్యాలెస్ అనే పెట్టారు. అయితే ఈ నిర్ణయంపై వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ భద్రత దృష్ట్యా వివాహ వేదికను మార్చాలని సూచించారు. ఈ మేరకు షర్మిలకు ఓ లేఖ కూడా రాశారు. అందులో లోటస్ పాండ్ నివాసంలో పెళ్లి చేద్దామని సలహా ఇచ్చారు. మరోవైపు యలహంక ప్యాలెస్ తన నివాసమని షర్మిల పెళ్లి పత్రికల్లో అచ్చు వేయించగా, జగన్ తన లేఖలో అది తన ఇల్లేనని పేర్కొన్నారు. దీంతో అసలు ఈ పెళ్లి వేదిక గొడవ ఏ మలుపు తిరుగుతుందోనని అంతా చర్చించుకున్నారు. తాజాగా షర్మిల ఈ వివాదంపై స్పందించారు. ఎక్స్ వేదికగా జగన్‌కు కౌంటర్ ఇస్తూ ఓ పోస్టు చేశారు.
తనకు హక్కు లేని దాని కోసం ఆశపడే నీచమైన మనస్తత్వం తనది కాదని షర్మిల జగన్‌కు ఘాటుగా బదులిచ్చారు. జగన్ సీఎం అయ్యాక అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్యాలెస్ (Yelahanka Palace) ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా తనకు, తన పిల్లలకు వచ్చిందన్నారు. ఇది దేవుడి సాక్షిగా నిజమని పేర్కొన్నారు. ఆ ఇల్లు తన బిడ్డల హక్కు అని, తన తండ్రి వైఎస్ఆర్ తిరిగిన ఇల్లు అని చెప్పారు. అలాగే తన కుమార్తె అంజిలి తన పెళ్లి ఆ ఇంట్లోనే జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. అందుకే యలహంక ప్యాలెస్‌లో పెళ్లికి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. సొంత ఇంట్లో పెళ్లి చేయడం తల్లిదండ్రులకు ఎంతో అదృష్టమని, కానీ, తన బిడ్డ కోరిక నెరవేర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పెళ్లి వేదికపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం అని, ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా జరపాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వివాహ వేడుకను యలహంక నివాసంలో కాకుండా ఇతర చోటుకు మార్చినట్లు చెప్పారు. అయితే వేదిక వివరాలు వెల్లడించలేదు. షర్మిల (YS Sharmila) ప్రకటనతో వివాహ వేదిక వివాదం ముగిసింది. కానీ, ఇంత జరిగిన తర్వాత జగన్ ఈ పెళ్లికి వస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read : రాప్తాడు ఘటనపై ప్రభుత్వం సీరియస్: హెచ్‌ఎంపై వేటు!
Follow Us On : WhatsApp

