కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. నార్త్ బెంగాల్ ప్రాంతంలోని 8 జిల్లాలు, సౌత్ బెంగాల్‌లోని 8 జిల్లాలతో కలిపి మొత్తం 16 జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఈ రోజు 152 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. నేటి ఎన్నికల్లో 1,452 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సుమారు 3.60 కోట్ల మంది ఓటర్లు వారి భవిష్యత్తును నిర్ణయించనున్నారు. స్థానికంగా టీఎంసీ(TMC), బీజేపీ (BJP) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సర్ ప్రక్రియపై తీవ్ర దుమారం అనంతరం జరుగుతున్న బెంగాల్ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సర్ ప్రక్రియతో బెంగాల్‌లో 12 శాతం ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో దాదాపు 80 నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. సుమారు 2.35 లక్షల సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.
గతంలో 2021లో ఇవే 152 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 59 స్థానాల్లో విజయం సాధించగా.. టీఎంసీ 93 స్థానాల్లో జెండా ఎగరేసింది. మరి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి. ఇక బెంగాల్‌లో రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 29న జరుగనున్నాయి. రెండో దశలో కోల్‌కతా సహా ఇతర ప్రాంతాల్లోని 142 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.

