ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

కలం, దేవరకొండ : ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రతి అర్హుడైన పేద ఓటరుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా చేపట్టిన ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik)  పిలుపునిచ్చారు. బుధవారం చింతపల్లి మండలంలో ఆయన విస్తృతంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలు, గిరిజన తండాల్లోని పోలింగ్ బూత్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఎస్‌ఐఆర్ నమోదు పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా బూత్‌ల వారీగా నమోదు ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ఇప్పటికే తమ పరిధిలో 100 శాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన బూత్‌ల బిఎల్ఓలు, బిఎల్ఏలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవాభావాన్ని, బాధ్యతాయుతమైన పనితీరును ప్రశంసించిన ఆయన.. ఇదే స్ఫూర్తితో మండలంలోని మిగిలిన అన్ని బూత్‌లలో కూడా వంద శాతం ఓటర్ల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈక్రమంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని నొక్కి చెప్పారు. అర్హుడైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ప్రతి ఇంటినీ సందర్శించి ధృవీకరించుకోవాలని సూచించారు. ప్రధానంగా పేదలు, గిరిజనులు, మహిళలు, యువత, వృద్ధుల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు నేరుగా చేరాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ విధివిధానాలు, దరఖాస్తుల సమగ్ర పరిశీలన, అవసరమైన పత్రాల సమర్పణ, ఇంటింటి ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ప్రతి బూత్‌లోనూ 100% లక్ష్యాన్ని చేరుకోవడానికి బిఎల్ఓలు, బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిపూర్ణ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>