కలం, వెబ్‌డెస్క్: బరువు తగ్గడానికి డైట్ (Weight Loss Diet) ప్లాన్ చేసుకునే వారు ఎక్కువగా ఎంచుకునే ఆహారం గుడ్డు (Egg). బరువు తగ్గాలనుకునే వారు తమ బ్రేక్‌ఫాస్ట్‌లో దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే “ఆమ్లెట్ vs ఉడకబెట్టిన గుడ్డు (Boiled Egg).. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్?” అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నా, బరువు తగ్గాలన్నా మన డైట్‌లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. ప్రోటీన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుడ్డు. ఇది చౌకగా, సులభంగా లభించే సూపర్ ఫుడ్. అయితే గుడ్డును మనం తినే విధానాన్ని బట్టి అది మన బరువును పెంచడమో లేదా తగ్గించడమో చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఉడికించిన గుడ్డు మంచిదా? ఆమ్లెట్ మంచిదా? అనే సస్పెన్స్ ఎప్పుడూ ఉంటుంది.
ఉడికించిన గుడ్డు
ఆరోగ్య నిపుణుల మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ ఉడికించిన గుడ్డుకే ఉంటుంది. ఎందుకంటే దీనిని వండటానికి ఎలాంటి అదనపు పదార్థాలు అవసరం లేదు. మీడియం సైజ్ ఉడికించిన గుడ్డులో కేవలం 70 నుండి 78 కేలరీలు మాత్రమే ఉంటాయి. నీటిలో మాత్రమే ఉడికించడం వల్ల ఎలాంటి అదనపు ఫ్యాట్ శరీరంలోకి చేరదు. ఇందులో లీన్ ప్రోటీన్‌తో పాటు విటమిన్ D, B12, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా వీటిని సులభంగా క్యారీ చేయవచ్చు. స్నాక్ టైమ్‌లో జంక్ ఫుడ్ తినకుండా ఇవి కాపాడుతాయి.
ఆమ్లెట్
ఆమ్లెట్ అనగానే నోరూరుతుంది. కానీ బరువు తగ్గాలనుకునే వారు దీని తయారీలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కేవలం గుడ్డుతో మాత్రమే వేసే సాధారణ ఆమ్లెట్‌లో వాడే నూనె, వెన్న లేదా నెయ్యి కారణంగా కేలరీల సంఖ్య 90 నుండి 200 వరకు పెరిగిపోవచ్చు. ఆమ్లెట్‌లో ఒక గొప్ప లూప్‌హోల్ ఉంది. ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్, పాలకూర, పచ్చిమిర్చి వంటి కూరగాయలను యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కూరగాయలు కలపడం వల్ల ఫైబర్ పెరిగి, కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు.
మీరు బరువు తగ్గే ప్రాసెస్‌ను మరింత వేగవంతం చేయాలనుకుంటే కొన్ని మార్పులు చేసుకోండి. ఒకవేళ మీరు కేలరీలను ఇంకా తగ్గించాలనుకుంటే, గుడ్డులోని పచ్చసొన పక్కన పెట్టి కేవలం తెల్లసొనతో ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్ తినవచ్చు. ఒక ఎగ్ వైట్‌లో కేవలం 17 కేలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ప్రోటీన్ పూర్తిగా అందుతుంది. ఆమ్లెట్ తినాలనిపిస్తే.. నార్మల్ పాన్ కాకుండా నాన్-స్టిక్ పాన్ వాడండి. నూనెకు బదులు కేవలం కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె స్ప్రే చేసుకుంటే కేలరీలు అదుపులో ఉంటాయి.
బరువు తగ్గడానికి ఏది బెస్ట్
మీరు వేగంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బరువు తగ్గాలనుకుంటే ఉడికించిన గుడ్లు తినడమే అత్యుత్తమ మార్గం. ఇది శరీరానికి లీన్ ప్రోటీన్‌ను అందిస్తూ కేలరీలను కంట్రోల్‌లో ఉంచుతుంది. కానీ మీకు రోజూ ఉడికించిన గుడ్డు తిని బోర్ కొడితే.. వారంలో రెండు మూడు సార్లు తక్కువ నూనె, ఎక్కువ కూరగాయలతో చేసిన వెజ్జీ ఆమ్లెట్‌ను నిస్సందేహంగా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవచ్చు. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

