కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapole) మండలం రాం సాగర్ గ్రామంలో హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంతో శ్యామ్ చారి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఒక మహిళతో శ్యామ్ చారికి ఉన్న సంబంధం ఆమె భర్తకు తెలిసింది. ఈ విషయమై సదరు భర్త భార్యకు విడాకులు ఇచ్చాడు. సంసారం ముక్కలవడానికి శ్యామ్ చారి కారణమంటూ సదరు మహిళ కుటుంబ సభ్యులు అతనిపై కక్ష పెంచుకున్నారు.
ఈ నెల 26న పక్కా ప్రణాళికతో శ్యామ్ చారిని పట్టుకున్న మహిళ కుటుంబ సభ్యులు అతని కాళ్లు, చేతులు కట్టేశారు. కర్రలు, డ్రిప్ పైపులతో విచక్షణారహితంగా చావబాదారు. ఈ దాడిలో శ్యామ్ చారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శ్యామ్ మరణించాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాయపోల్ పోలీసులు ఇరవై మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు.

