కలం, వెబ్ డెస్క్: అసలే సిలిండర్లు (Cylinder) అంతంతమాత్రంగా దొరుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలోని మీరట్‌లో జరిగిన స్కాం నెట్టింట వైరలవుతోంది. తారాపూరి ప్రాంతానికి చెందిన ఫహీం ఒక చిరుతిళ్ల వ్యాపారి. తన ఇంట్లో వంట చేసుకునేందుకు అత్యవసరంగా సిలిండర్ కావాలనుకుని బ్లాక్ మార్కెట్‌లో రూ.2,500 పెట్టి మరీ ఓ దళారి దగ్గర 14 కిలోల గ్యాస్ సిలిండర్ కొన్నాడు. వాస్తవానికి ఇది ఒరిజినల్ సిలిండర్ ధర కంటే చాలా ఎక్కువ. తీరా, గ్యాస్ స్టవ్ ఆన్ చేద్దామని వెళితే, ఎంతకూ వెలగలేదు. బర్నల్ దగ్గర నుంచి సిలిండర్ వరకు ప్రతీది చెక్ చేసినా.. లాభం లేకుండా పోయింది.
గ్యాస్ సిలిండర్ కింద పెట్టేసరికి..
ఫహీం గ్యాస్ బండను కింద పెట్టగానే, అందులో నుంచి నీరు లీకేజీ కావడం చూసి షాకయ్యాడు. దాన్ని పరీక్షించగా.. అది నీరే అని స్పష్టమైంది. వెంటనే, తన ఫోన్ లో వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరలైంది. రూ.2,500 పెట్టి గ్యాస్ కొంటే.. ఇలా నీళ్లు నింపి ఇచ్చారని ఫహీం వాపోయాడు. ఈ ఘటనపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు గ్యాస్ సిలిండర్ సరఫరా చేసిన వ్యక్తికి ఫోన్ చేసినా.. స్పందన లేకపోవడంతో ఫహీం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి మోసాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

