epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కాంట్రాక్టర్లు, సర్కారుకు మధ్య సయోధ్య

కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని హ్యామ్ (HAM Roads) విధానాన్ని అనుసరిస్తున్నా కాంట్రాక్టర్లతో తిప్పలు తప్పడంలేదు. రోడ్ల అభివృద్ధి కోసం టెండర్లను పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆందోళన పడిన ప్రభుత్వం చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇటీవల అటు కాంట్రాక్టర్లు, ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక ఫార్ములా కుదిరింది. ఇరు పక్షాలూ సంతృప్తి చెందడంతో ఇక రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధి పనులకు లైన్ క్లియర్ అయినట్లయింది. ఇంతకాలం కొనసాగిన ప్రతిష్ఠంభన తొలగిపోయింది. బ్యాంకర్ల సమక్షంలో కుదిరిన ఈ చర్చల్లో ఇకపైన ‘ఎస్‌క్రో’ (Escrow) ఎకౌంట్ల ద్వారా పేమెంట్లు జరిగేలా అంగీకారం కుదిరింది. దీంతో పనులు జరిగిన వెంటనే రెండు నెలల్లోనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుగుతాయి.

వివాదం ఏర్పడింది ఎలా ? :

రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొన్ని రోడ్లను హ్యామ్ (HAM Roads) పద్ధతిలో నిర్మించడం, అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం క్యాబినెట్‌లో చర్చించి విధాన నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. గత ప్రభుత్వంలో బిల్లులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నందున అప్పులు చేసి మరీ పనులు చేసినా వడ్డీ భారమే ఎదురైంది తప్ప ఫలితం లేదన్న స్వీయానుభవంతో ముందుకు రాలేదు. పేమెంట్స్ విషయంలో ప్రభుత్వంపై నమ్మకం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్దిష్ట గడువులోగా పేమెంట్స్ జరిగేలా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని పలువురు కాంట్రాక్టర్లు నొక్కిచెప్పారు. దీంతో అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు సకాలంలో పేమెంట్స్ జరిగేలా వారికి విశ్వాసాన్ని కల్పించాలని ప్రభుత్వం భావించింది.

బ్యాంకర్ల సమక్షంలో ఎస్‌క్రో అకౌంట్లు :

ఈ సంక్షోభాన్ని నివారించడానికి ప్రభుత్వం బ్యాంకర్ల సమక్షంలో కాంట్రాక్టర్లతో చర్చలు జరిపింది. బ్యాంకర్లు నోడల్ ఏజెన్సీగా ఉండేలా ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉంటే మంచిదనే ఏకాభిప్రాయం కుదిరింది. ఈ చర్చల్లో వచ్చిన ఫలితాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగా సానుకూలంగా స్పందించారని సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. అన్ని పక్షాలకూ సంతృప్తి ఉన్న ఎస్‌క్రో అకౌంట్ ఓపెన్ చేయడానికి ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారని, తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధాన నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఫైల్ ఇప్పటికే రెడీ అయిందని, సీఎం కార్యాలయానికి చేరుకుందని తెలిపాయి. ఈ మధ్యేమార్గంతో రెండు నెలల్లోనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుగుతాయి. చివరకు మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలోని రహదారుల విస్తరణ, రీకార్పెట్‌, నాలుగు, రెండు లేన్ల నిర్మాణాలు పూర్తవుతాయన్న విశ్వాసం వ్యక్తమైంది.

ఎస్‌క్రో అకౌంట్ ఎలా పనిచేస్తుంది? :

నిర్దిష్టంగా ఒక ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో ప్రభుత్వం తన 40% వాటాను నోడల్ ఏజెన్సీగా ఉండే బ్యాంకు దగ్గర ఎస్‌క్రో ఖాతాలో జమ చేస్తుంది. కాంట్రాక్టర్లు సైతం వారి వాటాగా 60% ముందుగానే జమ చేస్తాయి. ఈ డబ్బును అటు ప్రభుత్వంగానీ, ఇటు కాంట్రాక్టర్లుగానీ ఏకపక్షంగా డ్రా చేసుకునే అవకాశం ఉండదు. నోడల్ ఏజెన్సీగా ఉన్న బ్యాంకు ఆధీనంలో ఉంటుంది. ఈ డిపాజిట్‌తో పేమెంట్ సకాలంలో జరుగుతుందనే కాంట్రాక్టర్లకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రభుత్వం పేమెంట్ చేయాల్సిన పనిలేకుండా కాంట్రాక్టర్ చేసిన పనిని లెక్కించి నోడల్ ఏజెన్సీయే డబ్బులను రిలీజ్ చేస్తుంది. హ్యామ్ విధానంలో జరిగే పనులకు నేషనల్ హైవే అథారిటీ, రైల్వే తదితర సంస్థలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి గ్యారంటీ తీసుకుంటుంది.

రిజర్వు బ్యాంకు నుంచి ఆటోమేటిక్ డెబిట్ :

ప్రభుత్వం ఒకవేళ డబ్బు చెల్లించకపోతే ఎస్‌క్రో ఖాతా నుంచి స్వయంగా రిజర్వు బ్యాంకే కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తుంది. ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆర్బీఐ ద్వారా వచ్చే నిధుల నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. చెల్లింపులను ఎప్పటికప్పుడు నోడల్ ఏజెన్సీ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో సుమారు రూ. 20 వేల కోట్ల పనులు జరగనున్నట్లు ఇప్పటి అంచనా. ఫస్ట్ ఫేజ్‌లో రూ. 13.273 కోట్లు ఉంటుంది. మొత్తం మూడు అంచెల్లో కాంట్రాక్టర్లకు ఎస్‌క్రో అకౌంట్ ద్వారా పేమెంట్లు జరుగుతాయి. మొదటగా సాధారణ పద్ధతిలో పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ ద్వారా చెల్లింపుల, అక్కడ ఆశించిన ఫలితం లేనప్పుడు సంబంధిత ఫైల్ నేరుగా ఆర్థికశాఖకు చేరితే నోడల్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటుంది. అక్కడ కూడా పేమెంట్స్ లో జాప్యం జరిగితే ఆర్బీఐ చొరవ తీసుకుంటుంది.

Read Also: అధికారుల నిర్లక్ష్యం.. సర్కారుకు శాపం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>