కలం, వెబ్ డెస్క్ : రంగల్ పట్టణాన్ని హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). నర్సంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. గతంలో బీఆర్ ఎస్ మాటల వరకే ఉండేదని.. తాను కచ్చితంగా చేసి చూపిస్తానన్నారు. హైదరాబాద్ లా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు నిర్మిస్తామని తెలిపారు. మార్చి 31 లోగా వరంగల్ ఎయిర్ పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించిన ఆయన రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తాను వరంగల్ కు ఎప్పుడొచ్చినా కాకతీయులు, సమ్మక్క- సారక్క, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి పరిఢవిల్లినట్టే కనిపిస్తుందన్నారు. వరంగల్ ను డెవలప్ చేస్తా అని బీఆర్ ఎస్ నేతలు ఓట్లు దండుకున్నారు తప్ప చేయలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ భయపెట్టారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తున్నట్టు వివరించారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా అందించామని గుర్తు చేశారు. 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఒకే సారి చేసిన ప్రభుత్వం తమదే అన్నారు.
బీఆర్ ఎస్ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదని.. తమ ప్రభుత్వంలో ఒకేసారి అందరికీ ఇచ్చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది బిడ్డలకు సన్నబియ్యం అందిస్తున్నట్టు వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పుకొచ్చారు. అందుకే అన్ని రంగాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే కార్యక్రమాలు చేపట్టామన్నారు. కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని.. కాంగ్రెస్ కు అంతా అండగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Read Also: కాళోజీ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా రమేశ్ రెడ్డి
Follow Us On: Facebook


