అప్పటిలోపు ‘ఉత్తర ద్వారం’ సిద్ధం కావాలి: మంత్రి పొంగులేటి డెడ్‌లైన్

కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నాటికి ఉత్తర ద్వార అభివృద్ధి పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) అధికారులను ఆదేశించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన భద్రాచలం రామాలయాన్ని (Bhadrachalam Temple) దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో సాగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు.

​జిల్లా కలెక్టర్ అంకిత్ తో పాటు భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణలతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటికి భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఆలయ ఈఓ దామోదర్, తహసీల్దార్ రవికుమార్, ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య మంత్రి స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు.

దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను మంత్రి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. చిత్రకూట మండపం పరిసరాలు, గోశాల, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, ఉత్తర ద్వార దర్శన ప్రాంగణం, రామాలయ మాడవీధులను పరిశీలించి, అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

​ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన మంత్రి, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు పూర్తి కావలసిందేనని స్పష్టం చేశారు. డిసెంబర్‌లో జరిగే ముక్కోటి ఉత్సవాల నాటికి ఉత్తర ద్వార అభివృద్ధి పనులను, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాల నాటికి మిగిలిన ప్రధాన పనులన్నింటినీ సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే 2027 జూన్-జులైలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభం నాటికి గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నాన ఘాట్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.

​దివ్యక్షేత్రమైన భద్రాచలం ఆలయ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 276 కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నిర్మాణాల్లో ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా, దశాబ్దాల కాలం పాటు దృఢంగా ఉండేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భద్రాచలం క్షేత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తి తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>