లక్కు అంటే ఇంద్రకరణ్ రెడ్డిదే.. దేవాదాయ కలిసొచ్చిన ఏకైక మంత్రి!

కలం, నిర్మల్: తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ అంటేనే ఓ సెంటిమెంట్. ఆ శాఖను చేపట్టిన మంత్రులు పూర్తికాలం పదవిలో కొనసాగలేరన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే వచ్చిందన్న అభిప్రాయం ఉంది. అయితే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన నేతగా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) పేరు రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది. 2014లో బీఎస్పీ తరఫున నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి.. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో చేరారు. తన రాజకీయ ప్రస్థానంలో మంత్రి కావాలన్న ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్.. ఇంద్రకరణ్ రెడ్డికి కీలకమైన దేవాదాయ శాఖను అప్పగించారు.

రెండుసార్లు అదే శాఖ

2014 నుంచి 2018 వరకు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తిరిగి అదే శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా రెండు దఫాలు దేవాదాయ శాఖను నిర్వహించిన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మంత్రిగా ఉన్న సమయంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాలతోపాటు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ లాంటి కీలక అంశాల్లో ఆయన పాత్ర పోషించారు.

సెంటిమెంట్‌ను జయించి గెలుపు

దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వారు ఆ తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించరనే రాజకీయ సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం 2018లో మరోసారి విజయం సాధించి ఆ సెంటిమెంట్‌‌ను బ్రేక్ చేశారు. దీంతో దేవాదాయ శాఖ ఆయనకు కలిసొచ్చిన శాఖగా రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే చర్చ సాగింది. అయితే 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy).. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

మళ్లీ హస్తం గూటికి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా దేవాదాయ శాఖకు సంబంధించి రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆ శాఖను చేపట్టిన మంత్రులు పూర్తిస్థాయిలో పదవిలో కొనసాగలేరనే సెంటిమెంట్‌కు భిన్నంగా ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం రెండు దఫాలుగా మంత్రి కొనసాగారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>