కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శంభునిపేటలో శనివారం సమగ్ర శిక్ష తెలంగాణ, దివ్యాంగుల ఉపకరణాల సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ (Warangal Collector) సత్యశారద (Satya Sharada) పాల్గొని దివ్యాంగులకు 115 సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎప్పుడూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదని, జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
దివ్యాంగులకు దేవుడు అసాధారణ ప్రతిభను ప్రసాదించాడని, ఆ ప్రతిభను వెలికితీయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మనోవికాస కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత విద్యా సంవత్సరంలో ఆగస్టులో నిర్వహించిన అసెస్‌మెంట్ క్యాంపులో అర్హులుగా గుర్తించిన 99 మంది దివ్యాంగ విద్యార్థులకు గాను మొత్తం 115 సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ ఉపకరణాలలో బ్రెయిలీ కిట్లు, మొబైల్ ఫోన్లు, వీల్ చెయర్లు, వినికిడి యంత్రాలు, ఇతర అవసరమైన ఉపకరణాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, CMO డా. కె. శ్రీనివాస్, DM&HO డా. సాంబశివరావు మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఫీక్, ప్రత్యేక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

