కలం, వరంగల్ బ్యూరో: పరకాల కాంగ్రెస్ (Parakal Congress) రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరకాలలో నిర్వహించిన ‘ప్రజా పాలన–ప్రగతి బాట’ విజయోత్సవ సభకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం, అదే వేదికపై వచ్చే ఎన్నికల్లోనూ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునివ్వడం.. కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి, కొండా దంపతులకు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో తాజా పరిణామం ఆ చర్చకు మరింత ఆజ్యం పోసింది.
సీఎం సభకు ఎందుకు దూరం?
సీఎం రేవంత్ రెడ్డి ములుగు, పరకాల పర్యటనకు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కానీ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం పర్యటనకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె కొండా సుష్మితకు అవకాశం కల్పించాలని కొండా దంపతులు కోరుతున్నట్టు చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో సీఎం స్వయంగా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యేకు సీఎం బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో పరకాల టికెట్ మళ్లీ ప్రకాశ్ రెడ్డికే దక్కుతుందనే చర్చ జరుగుతున్నది. ఇది కొండా దంపతులకు షాక్ లాంటిదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
లెక్కలు మారుతున్నాయా?
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి, కొండా దంపతులకు మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, రాజకీయ ప్రాధాన్యత, భవిష్యత్ నాయకత్వంపై ఈ రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు ఉందన్న చర్చలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం పర్యటనకు మంత్రి సురేఖ దూరంగా ఉండటం, అదే సభలో ప్రకాశ్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని సీఎం పిలుపునివ్వడం.. ఈ రెండు పరిణామాలను కలిపి చూస్తే పరకాల కాంగ్రెస్‌లో రాజకీయ లెక్కలు మారుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘కొండా’ వర్గం ఏమంటున్నది?
సీఎం సభకు గైర్హాజరుపై మంత్రి కొండా సురేఖ నుంచి అధికారిక వివరణ లేకపోవడంతో, రాజకీయ కారణమేనని నిర్ధారించడం తొందరపాటు అవుతుందనే వాదనలు ఉన్నాయి. అదే సమయంలో సీఎం వ్యాఖ్యలను కూడా వచ్చే ఎన్నికల టికెట్‌పై తుది నిర్ణయంగా భావించలేమని కొండా అభిమానులు పేర్కొంటున్నారు.
అయితే పరకాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేకు సీఎం బహిరంగంగా మద్దతు ఇవ్వడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యమైన పరిణామమే. దీంతో పరకాల కాంగ్రెస్‌లో కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఆధిపత్య పోరును సీఎం పర్యటన కొత్త మలుపు తిప్పిందన్న చర్చ మొదలైంది. కొండా వర్గం దీన్ని ఎలా తీసుకుంటుంది? ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డితో విభేదాలు మరింత ముదురుతాయా? లేక హైకమాండ్ జోక్యంతో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

