కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) నగరాభివృద్ధికి కీలకమైన బడ్జెట్‌కు ఆమోదం లభించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బుధవారం జరిగిన సమావేశంలో పాలక వర్గం ఆమోదించింది.
మేయర్ గుండు సుధారాణి(Gundu Sudha Rani) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. బల్దియా అకౌంట్స్ అధికారి శివలింగం బడ్జెట్ వివరాలను సభ్యులకు వివరించగా, మెజారిటీ సభ్యులు అంగీకరించడంతో బడ్జెట్‌కు ఆమోద ముద్ర పడింది. ఈ బడ్జెట్‌లో సాధారణ పన్నుల ద్వారా రూ.349 కోట్ల 19 లక్షలు, వివిధ గ్రాంట్ల ద్వారా రూ.685 కోట్ల 20 లక్షలు, డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో రూ.620 కోట్లు సమకూరనున్నాయి.
ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇంచార్జి కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమిమ్ మసూద్, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ బడ్జెట్ ద్వారా నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, రోడ్లు, తాగునీటి సరఫరా వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

