కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు 98 శాతం పక్కదారి మళ్ళించారని.. వీరికి కేటాయించిన నిధులను 2 శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ లో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించే వాళ్ళం అని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు కాబట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెవులో పూలు పెట్టుకోని నిరసన తెలియజేశామని చెప్పారు. ఇంకో వారం రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.
అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరో వారం రోజుల పాటు అసెంబ్లీ జరగాలని కోరారు. సభ జరుగుతున్న తీరు అస్సలు బాగాలేదన్నారు. ఈరోజు సభలో రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు, 16 నోటిఫికేషన్‌లు, 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు. బీఆర్ఎస్ హయంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటుందని విమర్శించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం..
రాష్ట్ర నిరుద్యోగులను రేవంత్ సర్కార్ దగా చేసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. వెల్ఫేర్ బోర్డ్స్ కార్పొరేషన్‌లపై స్పష్టత ఇవ్వాలని తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. 33 కార్పొరేషన్లకు , 16 కార్పొరేషన్లకే కార్యాలయాలు ఉన్నాయని సమాధానం ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రజక ఫెడరేషన్‌కు రూ. 386 కోట్లు పెట్టి, రూ. 1 కోటి ఖర్చు చేసినట్లు సమాధానం చెప్పారని తెలిపారు. నాయి బ్రాహ్మణలకు రూ. 280 కోట్లు పెట్టి, 30 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని.. మున్నూరు కాపులకు రూ. 100 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదన్నారు. కృష్ణ బలిజలకు (పూసల) రూ. 100 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదని విమర్శించారు.
ఆర్యవైశ్యులకు రూ. 25 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదని చెప్పారు. బీసీ కార్పోరేషన్‌కు రూ. 1,370 కోట్లు పెట్టి, రూ. 6 కోట్లు ఖర్చు చేసినట్లు చేశారని.. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ. 2,730 కోట్లు పెట్టి, రూ. 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 5,403 కోట్లు పెట్టి, రూ. 74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

