అత్యాశే నేరగాళ్ల ఆయుధం.. అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సునీతారెడ్డి

కలం, వనపర్తి: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.సునీతారెడ్డి (Wanaparthy SP Sunitha Reddy) సూచించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అక్టోబర్‌ నెలను జాతీయ సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచనల మేరకు వనపర్తి జిల్లా పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సైబర్‌ క్రైమ్‌ అవగాహన పోస్టర్లను ఎస్పీ మంగళవారం విడుదల చేశారు.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని ఎస్పీ సూచించారు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, లోన్‌ యాప్‌లు, అధికారుల పేరుతో చేసే ఇంపర్సనేషన్‌ మోసాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ తదితర మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, ఉద్యోగ అవకాశాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని సునితా రెడ్డి (Wanaparthy SP) తెలిపారు.

వ్యక్తిగత వివరాలు వెల్లడించొద్దు..

అత్యాశే సైబర్‌ నేరగాళ్లకు ప్రధాన ఆయుధమని గుర్తించాలని ఎస్పీ సునీతారెడ్డి పేర్కొన్నారు. తెలియని వ్యక్తులను నమ్మి డబ్బులు పంపవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, PINలు, పాస్‌వర్డ్‌లు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. cybercrime.gov.inలోనూ ఫిర్యాదు నమోదు చేయవచ్చన్నారు. సకాలంలో సమాచారం అందిస్తే మోసపోయిన మొత్తాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ, ఐటీ సెల్‌ ఎస్‌ఐ నరేష్‌, సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>