కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలు, గర్భిణులు భోజనం చేస్తారు కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వారి భోజనం విషయంలో పరిశుభ్రత పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) ఆదేశించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ‘ప్రపంచ ఆహార భద్రత శిక్షణ’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీఓలు పాల్గొనగా నవీన్ ఆహార భద్రత, పరిశుభ్రత పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని, వంట చేసే ఆయాలు చేతులు పరిశుభ్రంగా కడుక్కుని వంట సామాన్లు, ఆహార పదార్థాలు ముట్టుకోవడం వంటివి చేయాలని సూచించారు. కూరగాయలు బాగా కడిగిన అనంతరం వాటిని వాడటం, పాత్రలు సబ్బుతో కడిగి వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవడం, స్టోర్ రూమ్‌కు మంచి గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
సరిగ్గా ఉడకని చికెన్ గర్భిణి తింటే గర్భిణితో పాటు కడుపులో ఉన్న శిశువు సైతం అనారోగ్యానికి గురవుతుందని ఉదాహరణగా చెప్పారు. అదేవిధంగా చిన్న పిల్లలు తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కరుణాకర్, డీసీపీఓ రాంబాబు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

