కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ (Ankapur) గ్రామంలో యూరియా కొరతపై (Urea Shortage) రైతులు ఆందోళనకు దిగారు. యూరియా బుకింగ్ యాప్‌ను రద్దు చేసి పాత విధానంలోనే నేరుగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో ఆర్మూర్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన అంకాపూర్‌లో కూడా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ విధానం కారణంగా ఎరువులు సమయానికి అందడం లేదని వారు ఆరోపించారు.
యూరియా యాప్‌ను తొలగించి సులభంగా, ప్రత్యక్షంగా ఎరువుల పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అధికారులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని అంకాపూర్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

