కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తన మీద వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డం పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. తాను కేంద్రమంత్రులను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరితే.. కిషన్ రెడ్డి వెళ్లి నిధులు ఇవ్వొద్దని చెబుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు తాజాగా కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను అభివృద్ధిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.
కలిసి పనిచేసేందుకు సిద్ధం
రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తనను అడ్డుకొనే శక్తి రేవంత్‌కు లేదన్నారు. రేవంత్ రెడ్డికి తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాను ఒక్కడినే ఉండాలన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. తన స్థాయిని మరిచి నోటికొచ్చినట్టు వాగుతున్నారని ఫైర్ అయ్యారు. తాను ఎవరికీ గులాంగిరి చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి గులాంగిరి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.

