కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపునకు మరి కొంత సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్‌గ్రామ్‌లో కలకలం రేగింది. నోవాపరా నియోజకవర్గానికి చెందిన సుమారు వెయ్యికి పైగా వీవీప్యాట్ స్లిప్పులు రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ, చెత్తకుప్పలో దర్శనమివ్వడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ముందు ఇలా వీవీప్యాట్ స్లిప్పులు రోడ్డుపాలు కావడంపై భద్రతా వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది తీవ్రమైన లోపమని ఆరోపిస్తూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ స్లిప్పులు చెత్తకుప్పలోకి ఎలా వచ్చాయనే కోణంలో అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

