‘ప్రాణహిత’ నిర్మాణం రైతులకు ఒక వరం‌‌‌.. ఆ వరాన్ని నెరవేర్చుతాం: మంత్రులు

కలం, ఆదిలాబాద్ బ్యూరో: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత బ్యారేజీ (Pranahita Barrage) నిర్మాణం రైతులకు ఒక వరం‌‌‌ అని.. ఆ వరాన్ని నెరవేర్చుతామని మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యారేజీ నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల దశను మార్చుతామన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాణహిత బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ సర్కార్ సిద్దమవుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే కుమ్రంభీం జిల్లా కౌటాల మండంలో తుమ్మిడిహట్టిని మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ప్రాణహిత నదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. తుమ్మిడిహెట్టి ప్రతిపాదిత స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బరాజ్ ఎత్తు, సామర్థ్యం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, మహారాష్ట్రలో ఉన్న శివిని గ్రామ పరిధిలోని ముంపు పరిధి, అటవీ, పర్యావరణ అనుమతులు, తదితర అంశాలపై సాగునీటి పారుదల శాఖ అధికారులతో చర్చించారు.

ఖజానాకు భారీ గండి కొట్టిన బీఆర్ఎస్..

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలకులు పక్కనబెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి బరాజ్ పునరుజ్జీవం పోయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో డా. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని గుర్తుచేశారు. అప్పట్లోనే 106 కి.మీ మేర కెనాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి, 71.5 కి.మీ మేర భూసేకరణ పూర్తి చేశారని, 46 కి.మీ మేర పనులు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేసి ఖజానాకు భారీ గండి కొట్టిందని మంత్రులు మండిపడ్డారు.

గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వం పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో ఆర్థిక భారం పెరగడమే కాకుండా విద్యుత్ బిల్లులు కూడా భారంగా మారాయని మంత్రి ధ్వజమెత్తారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోవడంతో ఇప్పుడు ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించవచ్చని.. తద్వారా సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు రైతాంగానికి గొప్ప మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల మేర బరాజ్ నిర్మాణానికి అంగీకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి చెప్పారు. “మహారాష్ట్రలోని శివిని గ్రామానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదు. భూములు కోల్పోయే వారికి మెరుగైన పరిహారం, సదుపాయాలు కల్పిస్తాం. ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయి” అని వివరించారు.

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చొరవ చూపాలి

ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఈ ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కోరారు. ‘వికసిత్ భారత్’ అని నినాదించే కేంద్ర ప్రభుత్వం, పెద్ద మనసుతో తెలంగాణ రైతుల పక్షాన నిలబడి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, పాల్వాయి హరీష్ బాబు, కలెక్టర్ హరిత, ఎస్పీ నిఖిత పంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>