కలం, వెబ్ డెస్క్: కొడంగల్‌లోని (Kodangal) వేంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలకు ‘పేదల తిరుపతి’గా విరాజిల్లుతోందని, తిరుమల తరహాలోనే ఇక్కడ ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. 2009లో తనను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తల త్యాగాలను రేవంత్ స్మరించుకున్నారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా, నందనవనంలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో విద్యా, వైద్యం కోసం పక్క ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తూ మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కాలేజీలతో పాటు సైనిక్ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యంగా నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేసి, కృష్ణా జలాలతో ఈ ప్రాంత భూములను తడపడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే వేగవంతమైందని, నిధుల కొరత లేదని భరోసా ఇచ్చారు. దీంతో పాటు రాబోయే ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుందని, లగచర్ల వద్ద 2300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ.. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కొడంగల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2009లో ప్రజలు నాటిన మొక్క నేడు ముఖ్యమంత్రి రూపంలో పెద్ద వృక్షంగా మారిందని, ఆ చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని రేవంత్ భావోద్వేగంగా మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేసి, కొడంగల్‌ను ఒక ‘బంగారు తునక’గా మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘మాజీ శానససభ్యులు గుర్నాథరెడ్డి ఎన్నో సార్లు గెలిచినా మంత్రి కాలేకపోయారు. కొడంగల్ అభివృద్ధి కోసం ఎన్నో విజ్ఝప్తులు చేసినా ఆనాడు ప్రయోజనం లేకపోయింది. 2018లో కొడంగల్‌లో నేను ఓడిపోయిన తర్వాత మల్కాజ్ గిరి ఎంపీగా నిలబడినప్పుడు ఇక్కడి నుంచి అనేక మంది కార్యకర్తలు వచ్చి కష్టపడి గెలిపించారు.‘ అని రేవంత్ గతాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

