కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రాష్ట్రానికి దాదాపు రూ. 5.75 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు ఆసక్తి చూపారు. యావత్తు దేశ దృష్టిని ఆకర్షించిన ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో పాటు ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు వచ్చి హాజరయ్యారు. రెండు రోజుల పాటు సమ్మిట్ సందడిగా కనిపించింది. సమ్మిట్ ఏర్పాట్లు, డ్రోన్‌ల విన్యాసం చూసిన రాష్ట్ర ప్రజలకు సమ్మిట్ ప్రాంగణాన్ని చూడాలన్న ఇంట్రెస్ట్ ఏర్పడింది.
దీన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ (Global Summit) ప్రాంగణాన్ని చూసేందుకు సాధారణ ప్రజలకు అవకాశం కల్పించింది. విద్యార్థులు, సందర్శకులకు ప్రభుత్వం శనివారం (ఈనెల 13) వరకు అనుమతినిచ్చింది. దీంతో బుధవారం సమ్మిట్ ప్రాంగణానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. పలు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏఐ రోబోలు (AI Robos), త్రీడీ స్క్రీన్లు, ఇతర ఏర్పాట్లు చూసి విజిటర్స్ మంత్రముగ్ధులయ్యారు. మరోవైపు సమ్మిట్ జరిగిన రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతానికి గురువారం నుంచి శనివారం వరకు ఉచిత బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ (RTC) ప్రకటించింది. ఆర్టీసీ ఉచిత బస్సులు నడపనుండడంతో రేపు, ఎల్లుండి సమ్మిట్ ప్రాంగణానికి మరింత జన సందడి పెరిగే అవకాశం ఉంది.
Read Also: పార్లమెంటులో CM రేవంత్.. BJP, TDP ఎంపీలతో ముచ్చట్లు
Follow Us On: Instagram


