కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ వర్గాల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒకప్పటి సహచరుడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (Amanpreet Singh Gill) ఇకలేరు. 36 ఏళ్ల వయసులోనే ఆయన బుధవారం చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమన్‌ప్రీత్ గిల్ తన కెరీర్‌లో అండర్-19 స్థాయిలో విరాట్ కోహ్లీతో కలిసి ఆడారు. 2007లో ఇంగ్లాండ్, మలేషియా, శ్రీలంక పర్యటనలకు వెళ్ళిన భారత అండర్-19 జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అయితే, కోహ్లీ కెప్టెన్సీలో 2008లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గిల్, ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశారు. అంతేకాకుండా, 2008లో జరిగిన మొదటి ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుత పంజాబ్ కింగ్స్) జట్టులో కూడా ఆయన భాగమయ్యారు.
ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన క్రికెట్‌తోనే కొనసాగారు. పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్‌గా సేవలందించారు. అమన్‌ప్రీత్ మరణం పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన ఎంతో అంకితభావంతో పంజాబ్ క్రికెట్‌కు సేవ చేశారని కొనియాడుతూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. గిల్ మరణవార్త విన్న విరాట్ కోహ్లీ షాక్‌కు గురయ్యారు. అమన్‌ప్రీత్ మరణం తనను ఎంతో బాధించిందని, ఆయన కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోహ్లీ సోషల్ మీడియా వేదికగా కోరుకున్నారు. అటు యువరాజ్ సింగ్ కూడా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో గిల్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నానని, ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటూ, కష్టపడి ఆడే వ్యక్తి అని యువరాజ్ పేర్కొన్నారు. గిల్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు.

