కలం, వెబ్ డెస్క్: ఇరాన్ (Iran)లో ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా గత పది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాటికి హింసాత్మక ఘటనలు తీవ్రమయ్యాయి. దేశవ్యాప్తంగా 100కి పైగా నగరాలకు నిరసనలు వ్యాపించాయి. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి, నిప్పంటించారు. అమెరికా మానవ హక్కుల సంస్థ ప్రకారం.. నిరసనల సమయంలో జరిగిన హింసలో ఇప్పటివరకు 45 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది పిల్లలు కూడా ఉన్నారు. ఒక పోలీసు అధికారి కత్తిపోట్లకు గురై మరణించాడు. 2,270 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోయాయి. టెహ్రాన్ విమానాశ్రయం మూతపడింది. సైన్యాన్ని అలర్ట్ అయ్యారు. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మషద్‌లో నిరసనకారులు జాతీయ జెండాను చింపేశారు. దేశ బహిష్కృత క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావి ఆదేశాల మేరకు నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అల్లర్ల (Violence)లో నిరసనకారులు చనిపోతే అమెరికా దాడి చేస్తుందని హెచ్చరించారు.


