కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు (Chervugattu) పార్వతి రామలింగేశ్వర స్వామి గట్టుపై కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లోని ఎల్లమ్మ గుడి వద్ద కుండల విక్రయాలు, బోనం సమర్పణ వంతుల (వాటాల) విషయంలో తలెత్తిన పాత వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలు బ్లేడ్లు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆలయ ప్రాంగణం రక్తసిక్తమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శాలివాహన (కుమ్మరి) కులస్తులు చెరువుగట్టుపై వంతుల వారీగా కుండలు అమ్ముకుంటూ, బోనాలు పెడుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే, తోబుట్టువులు లేని అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత.. తనకు కూడా ఈ కుండల అమ్మకాల్లో వాటా ఇవ్వాలని కొంతకాలంగా గొడవ పడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం వంతులో ఉన్న బొడ్డుపల్లి జ్యోతి, బొడ్డుపల్లి భవానీలపై సదరు మహిళ కత్తి, బ్లేడ్‌తో ఒక్కసారిగా దాడికి తెగబడింది. ఈ దారుణ దాడిలో జ్యోతి, భవానీలకు కత్తి పోట్లు పడి, చేతులు, మణికట్టుపై తీవ్ర రక్తగాయాలయ్యాయి.
ఒక మహిళ వేళ్లు తెగిపోయినట్లు సమాచారం. కళ్లముందే కత్తులతో దాడులు జరుగుతుండటంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. గమనించిన తోటి భక్తులు, పోలీసులు వెంటనే స్పందించి గొడవను ఆపారు. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ ఈ విషయమై ఇరువర్గాలు లీడర్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. గతంలో దేవస్థానం (Temple) ఈవో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఎల్లమ్మ గుడి వద్ద తరచూ ఇలాంటి ఘర్షణలు జరుగుతుండటంతో భక్తులు ఆలయానికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

