కలం, వెబ్ డెస్క్ : ఒలింపియన్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) రీ-ఎంట్రీకి మరో అడ్డంకి ఎదురైంది. 2026 ఆసియా గేమ్స్ ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించింది. శనివారం ఢిల్లీలో ట్రయల్స్ జరగాల్సి ఉండగా.. ఫెడరేషన్ తాజా లీగల్ స్టెప్‌తో వినేశ్ భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. మే 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశం చట్టబద్ధంగా సరైనది కాదని WFI తన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో పేర్కొంది.
పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందని ఫెడరేషన్ అభ్యంతరం తెలిపింది. ఆసియా గేమ్స్ ట్రయల్స్‌కు ప్రకటించిన ఎంపిక నిబంధనల ప్రకారం వినేశ్ అర్హురాలు కాదని WFI వాదించింది. అంతర్జాతీయ టోర్నీలకు ఆటగాళ్ల ఎంపిక చేసే హక్కు గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమాఖ్యకే ఉంటుందని తెలిపింది. క్రీడా ఎంపికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని కూడా ఫెడరేషన్ అభిప్రాయపడింది.
డిసెంబర్ 2024లో వినేశ్ స్వచ్ఛందంగా రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిందని WFI తెలిపింది. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. ప్రపంచ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ తర్వాత తిరిగి పోటీల్లోకి రావాలంటే ఆరు నెలల పాటు తప్పనిసరిగా డోప్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని ఫెడరేషన్ గుర్తుచేసింది. డిసెంబర్ 18, 2025న జరిగిన డోప్ టెస్ట్ ప్రయత్నం విఫలమైన కేసులో మే 4న వినేశ్‌పై ‘మిస్డ్ టెస్ట్’ నమోదు అయినట్లు తెలిపింది.
ఆ తర్వాత మే 9న షోకాజ్ నోటీసు కూడా జారీ చేసినట్లు పేర్కొంది. వినేశ్‌పై క్రమశిక్షణ చర్యల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయ్యే వరకు వేచి చూడాలని ఫెడరేషన్ కోరింది. ఇక ఫిబ్రవరి 2026లో విడుదల చేసిన ఎంపిక విధానంలో ‘ఐకానిక్ ప్లేయర్’ లేదా మాతృత్వం ఆధారంగా ప్రత్యేక మినహాయింపుల గురించి ఎలాంటి నిబంధన లేదని WFI స్పష్టం చేసింది. ఎంపికలు ఎప్పుడూ ప్రతిభ, తాజా ప్రదర్శనల ఆధారంగానే జరుగుతున్నాయని తెలిపింది.
ప్రతి వెయిట్ కేటగిరీలో ఇప్పటికే 12 మంది రెజ్లర్లు వివిధ జాతీయ పోటీల ద్వారా ట్రయల్స్‌కు అర్హత సాధించారని ఫెడరేషన్ పేర్కొంది. అయితే హైకోర్టు నిర్ణయం తీసుకునే ముందు వారి వాదనలు వినలేదని తెలిపింది. ఇక వినేశ్‌కు ముందు నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం నిరాకరించబడింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మొదట ఉపశమనం లభించకపోయినా.. తర్వాత డివిజన్ బెంచ్ మే 30 ట్రయల్స్‌లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది.

