కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, వివిధ శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 115 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా కేంద్రాల్లో కూడా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. లోడింగ్ చేపట్టి మిల్లులకు తరలించాలని, మిల్లుల్లో కూడా సత్వరమే అన్ లోడింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో, పక్కా ప్రణాళికతో వ్యవహరించి.. కొనుగోళ్ల నిర్వహణలో కరీంనగర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని సూచించారు. ఈ సమీక్షలో సివిల్ సప్లై అధికారి నర్సింగరావు, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, సహకార అధికారి రామానుజాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

