కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండలం మోరపల్లి గ్రామ శివారులోని మోరపల్లి గుట్టను చదును చేసి ప్రభుత్వ పాఠశాల నిర్మించాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని గ్రామస్థులు (Morapalli Villagers) కోరారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాల నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే పాఠశాల నిర్మాణానికి గుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేయడంపైనే తమకు అభ్యంతరం ఉందని గ్రామస్థులు తెలిపారు.
రూ.25 కోట్ల అదనపు వ్యయం మోరపల్లి గుట్ట సర్వే నంబర్ 154లో సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను చదును చేసి పాఠశాల నిర్మాణానికి అనువుగా మార్చాల్సి ఉంటుందని గ్రామస్థులు పేర్కొన్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టను ప్రొక్లెయిన్లతో తొలగించడం, రాళ్లను బ్లాస్టింగ్ ద్వారా పగలగొట్టడం, అనంతరం పునాదులు ఏర్పాటు చేయడం వంటి పనులకు భారీగా అదనపు ఖర్చు అవుతుందని వారు తెలిపారు.
తమ అంచనా ప్రకారం ఈ ప్రక్రియకు సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు వ్యయం అయ్యే అవకాశం ఉందని, ఇంతటి ప్రజాధనాన్ని ఖర్చు చేయడం సమంజసం కాదని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు. అదే మొత్తాన్ని వినియోగిస్తే రోడ్డు ఫేసింగ్‌లో అందుబాటులో ఉన్న సమతల భూమిని పాఠశాల నిర్మాణానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని వారు సూచించారు.
లక్ష చెట్ల తొలగింపుపై ఆందోళన :
గుట్టను చదును చేసే క్రమంలో పెద్ద సంఖ్యలో చెట్లను తొలగించాల్సి వస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు లక్ష చెట్లు నరికివేయాల్సి వస్తుందని వారు పేర్కొంటూ, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. మోరపల్లి గ్రామానికి మిగిలి ఉన్న ముఖ్యమైన గ్రామ ఆస్తుల్లో ఈ గుట్ట ప్రాంతం ఒకటని, తరతరాలుగా గ్రామస్థులు ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని వారు తెలిపారు. పాఠశాల నిర్మాణం పేరుతో గుట్టను పూర్తిగా తొలగించడం వల్ల గ్రామం తన సహజ వనరులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలి :
మోరపల్లి పరిసరాల్లో అదనపు ఖర్చు లేకుండా పాఠశాల నిర్మాణానికి అనువైన ప్రభుత్వ సమతల భూములు అందుబాటులో ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రభుత్వ నిధుల సద్వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలని కోరారు. గుట్టను చదును చేయడం ద్వారా ఎదురయ్యే పర్యావరణ, ఆర్థిక, భవిష్యత్ సమస్యలను పరిశీలించి, పాఠశాలను మరో అనువైన సమతల ప్రదేశంలో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను మోరపల్లి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్యాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఆగునూరి గంగరాజాం, మాజీ ఉపసర్పంచ్ ప్రకాష్, దమ్మ లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ దొంగ మోహన్‌రెడ్డి, నాయకులు దుమల దేవయ్య, అబ్దుల్లా, బేతి రాంమోహన్‌రెడ్డి, కన్నవేణి అమరేందర్‌రెడ్డి, ఎడమల నారాయణరెడ్డి, దీకొండ రమేష్, తురగ జైపాల్, కాలగిరి తిరుపతిరెడ్డి, ఎడమల రాజిరెడ్డి, ఎడమల మల్లారెడ్డి, బోల్లె వంశీ తదితరులు పాల్గొన్నారు.

