కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, నాణ్యమైన శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో “చదువుకో తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా 2025-36 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటం ప్రతి ఒక్కరి బాధ్యత
అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ‘మహబూబ్నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, వారు ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
గతంలో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ, పుస్తకాలు, సమయపాలన, మార్గదర్శనం అందించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు. విద్యార్థులు కష్టపడేలా ప్రోత్సహించడం, వారి ప్రతిభను వెలికితీయడం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సమాజం బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతో కీలకమని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యారంగంలో గొప్ప మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. విద్యా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీరామ్ గ్రూప్ వంటి సంస్థలు సహకారం అందిస్తే మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయవచ్చని అన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉన్నత విద్య, పరిశోధన, వ్యాపార రంగాలు, పరిశ్రమల స్థాపన వంటి విభిన్న రంగాల్లో రాణించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటేలా అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రీరామ్ గ్రూప్ అందిస్తున్న సహకారం అభినందనీయమని, ఇలాంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలు మరిన్ని సంస్థలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. విమర్శలను పట్టించుకోకుండా విద్యార్థుల అభ్యున్నతి, సమాజ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.
టెన్త్ టాపర్లకు రూ. 2 లక్షల చెక్కులు అందజేత
అనంతరం జిల్లా టాపర్ ఆరాధ్య (జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, పెద్ద ఆదిరాల)కు రూ. 2 లక్షల రూపాయల విలువైన చెక్కును, అలాగే దేవరకద్ర నియోజకవర్గ టాపర్ నిశిత (ZPHS, దేవరకద్ర) , మహబూబ్ నగర్ నియోజకవర్గం టాపర్ సాన్వీ (బేసిక్ ప్రాక్టీస్ హైస్కూల్) లకు చెరో లక్ష రూపాయలు చెక్కును ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. వివిధ మండలాల టాపర్లకు రూ. 10,000 చొప్పున ఒక్కో విద్యార్థికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, శ్రీరాం గ్రూప్ ఫైనాన్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , ఎజీఎం సతీష్, ఎఎంఓ దుంకుడు శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మైత్రి యాదయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ఏర్పుల నాగరాజు, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ సమన్వయ కర్త రవీందర్ రెడ్డి, తాటికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలు యాదవ్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

