కలం, వెబ్ డెస్క్: ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. కేరళ సీఎం విజయన్ (Vijayan), మోడీ ఒక్కటేనంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణలకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముందే తన రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచించారు. తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజర్‌లతో కూల్చివేస్తూ కేరళ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని పినరయి అన్నారు. ముందుగా తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కేరళపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.
కేరళలో పేదరికం కేవలం 0.55 శాతం మాత్రమే ఉందని, ఇది దేశంలోనే అత్యల్పమని పేర్కొన్నారు. సంక్షేమం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో కేరళ ముందంజలో ఉందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ నిధులను తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
డిజిటల్ పరిపాలన విషయంలో కూడా కేరళ ముందుందని చెబుతూ, 2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్‌ను అధ్యయనం చేశారని గుర్తుచేశారు. ఇది కేరళలో అమలవుతున్న పారదర్శక పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. పెన్షన్లు ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం కేరళకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని విమర్శించారు. ముందుగా తమ రాష్ట్రంలో పరిపాలనను మెరుగుపర్చాలని సూచించారు. సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రావాలని పినరయి విజయన్ (Vijayan) ఆహ్వానించారు. కేరళ మోడల్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
Read Also: చంద్రుడి చెంతకు నలుగురు వ్యోమగాములు.. వీడియో విడుదల
Follow Us On: Instagram

