కలం, వెబ్‌డెస్క్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే (Vijay Hazare Trophy) లో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమి మూటగట్టుకుంది. బుధవారం రాజ్‌కోట్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఓడింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 50 ఓవర్లలో 417/4 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు నితిన్ పాండ్యా (122; 110 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), అమిత్ పాసి (127; 93 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) తోపాటు కెప్టెన్ కృనాల్ పాండ్యా(109 నాటౌట్; 63 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో కదంతొక్కారు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 2 వికెట్లు తీయగా, తనయ్ త్యాగరాజన్, వరుణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అభిరత్ రెడ్డి (130; 90 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రణయ్ రెడ్డి (113; 98 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీల మోత మోగించారు. అయినా, మిగిలిన వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 49.5 ఓవర్లలో 380 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రత్యర్థి జట్టులో అరిత్ సేథ్, మహేశ్ చెరో 3, రాజ్ లంబానీ, కరణ్ ఉమత్ చెరో 2 వికెట్లు తీశారు.
ఆంధ్రదీ అదే దారి..:
విజయ్ హజారే (Vijay Hazare Trophy) లో ఆంధ్ర జట్టు సైతం పరాజయాల బాటలోనే కొనసాగుతోంది. టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆంధ్ర మూడింటిలో ఓటమి పాలైంది. బుధవారం బెంగళూరు వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 245/7 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్(61), చిరాగ్ జైనీ(69), రుచిత్ అహిర్(76) అర్ధసెంచరీలు చేశారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 3, కలిదిండి రాజు 2 వికెట్లు తీయగా, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి, జాగర్లపూడి రామ్ చెరో వికెట్ పడగొట్టారు. ఛేదనలో బ్యాటర్లు సమష్టిగా విఫలమవడంతో ఆంధ్ర 47.2 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జ్ఞానేశ్వర్(33), నితీశ్ కుమార్ రెడ్డి(30), కలిదిండి రాజు(30) ఓ మోస్తరు పరుగులు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో అంకుర్ పవార్ 5 వికెట్లు తీశాడు.
Read Also: 20వ ప్రపంచ చెస్ టైటిల్ గెలిచిన మాగ్నస్ కార్ల్‌సెన్
Follow Us On: Sharechat


