కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(Vijay)ని నిత్యం ఏదో సమస్య వెంటాడుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం కావడంతో మిత్రపక్షాలను సంతృప్తి పరచడం ఇబ్బందికరంగా మారింది. తాజాగా విజయ్ క్యాబినెట్‌లో ఏఐడీఎంకే రెబల్స్‌కు అవకాశం ఇవ్వబోతున్నారన్న వార్తలు కలకలం రేపాయి. ఈ వార్తలను మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేతలు మాట్లాడుతూ.. ఏఐడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇస్తే తాము మద్దతుపై పునరాలోచిస్తామని హెచ్చరించారు. దీంతో టీవీకే నేతలు రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో, టీవీకే నాయకుడు ఆదవ్ అర్జున ఈ ప్రచారాలను ఖండించారు. ఏఐడీఎంకే లేదా ఏ పార్టీని కూటమిలో చేర్చుకొనే నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మిత్రపక్షాల విషయంలో సీఎం విజయ్ క్లారిటీతో ఉన్నారని.. ఇప్పటికే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలను ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించినట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణపై జరుగుతున్న చర్చలపై ఆదవ్ అర్జున స్పందించలేదు. ఈ విషయంపై తుది నిర్ణయం సీఎం విజయ్ త్వరలో ప్రకటిస్తారని ఆదవ్ అర్జున తెలిపారు.
ఇక కాంగ్రెస్ పార్టీ 5 సీట్లతో టీవీకే కూటమిలో పెద్ద భాగస్వామిగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు ఇప్పటివరకు బయట నుంచే మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. టీవీకే ప్రభుత్వం సామాజిక న్యాయం సిద్ధాంతంతో ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. అలాగే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన అస్థిర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీలు కూటమి మార్పులకు ప్రయత్నించాయని ఆరోపించారు.
ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం 107 మంది ఎమ్మెల్యేలతో కొనసాగుతుండగా, కాంగ్రెస్ సహా మిత్రపక్షాల మద్దతుతో సంఖ్య 120కి చేరింది. మెజారిటీ మార్క్ 118 కావడంతో ప్రభుత్వానికి స్వల్ప మెజారిటీ ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో AIADMK తిరుగుబాటు ఎమ్మెల్యేల చేరికపై వస్తున్న ఊహాగానాలు, అలాగే మిత్రపక్షాల హెచ్చరికలు సీఎం విజయ్ ప్రభుత్వానికి కొత్త రాజకీయ ఒత్తిడిని తెచ్చిపెట్టాయి. క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

