కలం, ఖమ్మం బ్యూరో: “ఇంకా రెండున్నరేళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని ప్రజలు అనుభవించక తప్పదా?” అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బుధవారం ఖమ్మం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసి జనాలను ఘోరంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ దుర్మార్గపు పాలనను భరిస్తూ మరో రెండున్నరేళ్ల పాటు ప్రజలు కష్టాలు అనుభవించక తప్పని దుస్థితి దాపురించిందని వద్దిరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా ఇప్పుడు ఒకే నినాదంతో ఉన్నారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా “రేవంత్ పోవాలి-కేసీఆర్ రావాలి” అనే డిమాండ్ ప్రజల నుంచి బలంగా వినిపిస్తోందని వద్దిరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజులు అందక, యువతకు ఉద్యోగాలు లేక, రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసే దిక్కు లేక రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. బీసీలకు, మహిళలకు అండగా ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తీరా గద్దె నెక్కాక వారిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో యువతకు, మహిళలకు రాజకీయంగా మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తాయని వద్దిరాజు భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా, గులాబీ శ్రేణులంతా అత్యంత క్రమశిక్షణతో, ఐకమత్యంతో శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల గూబ గుయ్య్‌మనేలా, ఇక్కడి 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి కాంగ్రెస్‌కు చరమగీతం పాడాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

