కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గంలోని బల్మూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దేవరకొండ ఫౌండేషన్’ (The Deverakonda Foundation) ఆధ్వర్యంలో 47 ప్రభుత్వ పాఠశాలలలో 9, 10 తరగతులలో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన 181 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన వారికి రూ.10,000, సెకండ్ ర్యాంకు సాధించిన వారికి రూ.5,000 చొప్పున ప్రోత్సాహకంగా అందించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డీఈఓ రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ (Vamshi Krishna) మాట్లాడుతూ, సొంత ప్రాంతాన్ని మర్చిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ దేవరకొండ–రష్మిక దంపతులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు. అచ్చంపేట ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాల ఏర్పాటు చేయాలని కూడా కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే విజయాన్ని సులభంగా అందుకోవచ్చని విజయ్ దేవరకొండ అన్నారు.
జీవితంలో విఫలాలు వచ్చినా వాటి నుంచి నేర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలని చెప్పారు. విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ, చిన్నారులపై ఉన్న ప్రేమతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

