కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ అనంతరం అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్లు(Argentina Stars) లిసాండ్రో మార్టినెజ్(Lisandro Martinez), అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లకు (Alexis Mac Allister) ఇంగ్లండ్‌లో భద్రత పెంచినట్లు సమాచారం. అర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం లిసాండ్రో మార్టినెజ్ “లాస్ మాల్వినాస్ అర్జెంటీనావే” అనే సందేశం ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించాడు. అలెక్సిస్ మాక్ అలిస్టర్ కూడా విజయ సంబరాలలో పాల్గొన్నాడు. ఫాక్‌ల్యాండ్ దీవుల విషయంలో బ్రిటన్, అర్జెంటీనా మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. అర్జెంటీనా ఈ దీవులను మాల్వినాస్ అని పిలుస్తుంది. ఈ నేపథ్యంతో ఆటగాళ్లపై ఎలాంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా వారి నివాసాల వద్ద రెండు రోజుల పాటు ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే ఆటగాళ్ల ఇళ్ల వద్ద ఎలాంటి విధ్వంసం లేదా దాడి జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించలేదు. లిసాండ్రో మార్టినెజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఈ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యక్షంగా పాల్గొనలేదని సమాచారం. అలెక్సిస్ మాక్ అలిస్టర్ ప్రస్తుతం లివర్‌పూల్ జట్టులో కొనసాగుతున్నాడు. బ్యానర్ ప్రదర్శనపై స్పందించిన మార్టినెజ్.. అర్జెంటీనా ప్రజల భావోద్వేగాలను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఆ చర్య తీసుకున్నట్లు తెలిపాడు. మరో అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, ఇది తమ దేశ చరిత్రలో బాధాకరమైన అధ్యాయమని పేర్కొన్నాడు. 1982లో ఫాక్‌ల్యాండ్ దీవులపై బ్రిటన్, అర్జెంటీనా మధ్య యుద్ధం జరిగింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులతో పాటు దీవుల పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ చారిత్రక వివాదం ఇప్పటికీ రెండు దేశాల మధ్య సున్నితమైన అంశంగా కొనసాగుతోంది.

