కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా పరిధిలో వరుస మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను(Bike Theft Gang) కూసుమంచి, ఖమ్మం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడగా, వారి నుంచి 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 10 బైక్ చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. కూసుమంచి, ఖమ్మం రూరల్ పోలీసులు చేపట్టిన తనిఖీలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్, ఖమ్మం త్రీ టౌన్, ఖానాపురం హవేలి, కూసుమంచి, సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు తామే పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు.
విచారణలో ప్రధాన నిందితుడు చిలకబత్తిని వెంకటేష్ నలుగురు బాలలను తనతో కలుపుకుని రాత్రి వేళల్లో పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను డూప్లికేట్ తాళాల సహాయంతో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం చోరీ చేసిన వాహనాలను తక్కువ ధరలకు విక్రయించినట్లు తేలింది. ఈ కేసులో పోలీసులు సూర్యాపేట జిల్లా మోతే మండలం అన్నారిగూడెంకు చెందిన మండవ సాయి (A-2), ఖమ్మం రూరల్ మండలం మారుతీనగర్‌కు చెందిన కొక్కు రోనక్ (A-3), పెద్దతండాకు చెందిన రామాల మహేందర్ (A-4)లను అదుపులోకి తీసుకున్నారు. చోరీ వాహనం కొనుగోలు చేసిన రామానగుట్టకు చెందిన ప్రసాదం రాజు (A-5)కు BNS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. నేరాలలో పాల్గొన్న నలుగురు బాల నేరస్తులను జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం బుధవారం జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు చిలకబత్తిని వెంకటేష్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

